పలాసకు వచ్చి చంద్రబాబుకు రూ. 66 లక్షల విరాళాన్ని అందజేసిన నారా బ్రాహ్మణి!

తిత్లీ తుపాను దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలకు సాయం చేయాలంటూ, హెరిటేజ్ గ్రూప్ సంస్థల తరఫున నారా బ్రాహ్మణి రూ. 66 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ ఉదయం పలాస రైల్వే స్టేషన్ మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో చంద్రబాబు పాల్గొనగా, బ్రాహ్మణి అక్కడికి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చెక్కును చంద్రబాబుకు అందజేసిన ఆమె, గ్రామాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని కోరారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, తుపాను ప్రభావిత ప్రాంతాలను తాను చూశానని, అక్కడి పరిస్థితిని చూసి చాలా బాధపడ్డానని అన్నారు. తనవంతు సాయంగా ఏమైనా చేయాలన్న ఉద్దేశంతోనే హెరిటేజ్ తరఫున ఈ సాయం చేశానని చెప్పారు. తమ సంస్థ ద్వారా మంచినీరు, మజ్జిగ, పాలు అందిస్తున్నామని, ఇతర సంస్థలు కూడా ముందుకొచ్చి తుపాను బాధితులను ఆదుకోవాలని బ్రాహ్మణి కోరారు.

ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు, బ్రాహ్మణిలకు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులతో పాటు ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu
brahmani
Titley
Heritage
Srikakulam District

More Telugu News